
- ఈనెల 31వరకు అప్పగించకపోతే కఠిన చర్యలు
- కేసులు పెడుతామంటున్న ఆఫీసర్లు
- ఇప్పటికే 25శాతం ఫైన్‌తో అప్పగించాలని ఆదేశాలు
- పెద్దపల్లి జిల్లాలో 25వేల టన్నుల సీఎంఆర్ పెండింగ్
పెద్దపల్లి, వెలుగు: రైస్ మిల్లర్లు గడువులోగా సీఎంఆర్(కస్టం మిల్లింగ్ రైస్) అందించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో గడువులోగా సీఎంఆర్ అప్పగించకపోతే చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 2023–24 ఏడాది గానూ పెద్దపల్లి జిల్లాలో 25 రైస్ మిల్లుల నుంచి సుమారు 25వేల టన్నుల సీఎంఆర్ పెండింగ్‌లో ఉన్నట్లు సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు సీఎంఆర్ అప్పగించకపోవడంతో సివిల్ సప్లయ్ అధికారులు గత నెల 31 వరకు గడువు విధించారు. ఆదేశాలు ఇచ్చినా సీఎంఆర్ ఇవ్వకపోవడంతో చివరి అవకాశంగా ఈనెల 31 వరకు గడువును పొడిగించారు. దీంతోపాటు ప్రతి క్వింటాకు 25 కేజీల బియ్యం ఫైన్‌గా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
25 రైస్ మిల్లులు నుంచే పెండింగ్
పెద్దపల్లి జిల్లాలో మొత్తం 140 వరకు రైస్ మిల్లులున్నాయి. వాటిలో 25 మిల్లులు సీఎంఆర్ పెండింగ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి నుంచి దాదాపు 25 వేల టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. నాలుగు సీజన్లకు సంబంధించి సీఎంఆర్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు సీజన్లకు చెందిన సీఎంఆర్ అప్పగించేందుకు ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చారు.
అలాగే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కానీ మిల్లర్లు అధికారుల ఆదేశాలు బేఖాతర్ చేశారు. మరో సీజన్ వడ్లు మిల్లులకు పంపేందుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలనే నిబంధనలు విధించినా అమలుకాలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో పెండింగ్ మిల్లులకు కూడా వడ్లు ఇవ్వాల్సి వచ్చింది.
కాగా ఇప్పటికీ సదరు మిల్లుల నుంచి సీఎంఆర్ ప్రభుత్వానికి తిరిగి రాలేదు. ఇదే సమయంలో నిబంధనలు పాటించిన మిల్లర్లను అడ్డంపెట్టుకొని కొందరు డిఫాల్టర్ మిల్లర్నిర్వాహకులు దందా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిల్లర్లు మాత్రం రెండేండ్ల క్రితం సీఎంఆర్ మాత్రమే పెండింగ్ ఉందని, 2024–25 ఖరీఫ్ సీఎంఆర్ దాదాపు 90 శాతం అప్పగించినట్లు చెప్తున్నారు.
ఈ సారి గడువు దాటితే కేసులే
చాలాసార్లు సీఎంఆర్ అప్పగించడానికి మిల్లర్లకు అవకాశం ఇచ్చాం. ఈ నెల 31 డెడ్‌లైన్ విధించాం. గడువులోగా పెండింగ్ సీఎంఆర్ ఉన్న మిల్లర్లు తప్పకుండా బియ్యం అప్పగించాలి. లేకపోతే క్రిమినల్ కేసులు పెడతాం. ఇప్పటికే డిఫాల్టర్ మిల్లర్లకు ఫైన్ కింద ప్రతీ క్వింటాకు అదనంగా 25 కేజీల బియ్యం ఇవ్వాలని నిబంధన పెట్టాం. ఎం. శ్రీకాంత్ రెడ్డి, డీఎం సివిల్ సప్లయ్